Adobe New CEO: అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్ (Adobe)లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన అనిల్ చక్రవర్తి (Anil Chakravarthy) నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈఓగా ఉన్న శంతను నారాయణ్ ఆ పదవి నుంచి వైదొలగనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. అడోబ్ ప్రకటించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 1 నుంచి అనిల్ చక్రవర్తి కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా సంస్థకు నాయకత్వం వహించిన శంతను నారాయణ్ ఇకపై ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో డిజైన్, క్రియేటివ్ సాఫ్ట్‌వేర్ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అడోబ్ ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో సంస్థకు కొత్త సీఈఓగా అనిల్ చక్రవర్తి బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనిల్ నాయకత్వంలో AI ఆధారిత ఉత్పత్తులు, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్, క్రియేటివ్ టూల్స్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ వంటి విభాగాల్లో అడోబ్ మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు శంతను నారాయణ్ మార్చిలో ప్రకటించారు. అయితే సంస్థతో ఆయన అనుబంధం కొనసాగనుంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా అడోబ్‌కు తన సేవలను అందించనున్నారు. AI యుగంలో అడోబ్ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనిల్ చక్రవర్తి సరైన వ్యక్తి అని శంతను నారాయణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అనిల్‌కు సంస్థ వ్యాపారం, కస్టమర్లు, సాంకేతికతపై మంచి అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు.
అనిల్ చక్రవర్తి భారత్‌లోనే తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. ఐఐటీ వారణాసి నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech) పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో మాస్టర్ ఆఫ్ సైన్స్, పీహెచ్‌డీ పట్టాలు పొందారు. 2020లో అడోబ్‌లో చేరిన అనిల్.. సంస్థలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. తొలుత డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ వ్యాపారానికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలతో పాటు గ్లోబల్ సేల్స్‌కు సంబంధించిన బాధ్యతలను కూడా పర్యవేక్షించారు. అడోబ్‌లో చేరకముందు అనిల్ చక్రవర్తి క్లౌడ్ డేటా మేనేజ్‌మెంట్ సంస్థ ఇన్ఫర్మాటికాలో సుమారు నాలుగేళ్లపాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడ ఆయనకు టెక్నాలజీ, క్లౌడ్ సాఫ్ట్‌వేర్, ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ రంగాల్లో విస్తృత అనుభవం లభించింది.
శంతను నారాయణ్ తర్వాత అడోబ్ సీఈఓగా అనిల్ చక్రవర్తి నియమితులు కావడంతో మరోసారి భారతీయుడికి ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ నాయకత్వ బాధ్యతలు దక్కినట్లయింది. టెక్నాలజీ రంగంలో భారతీయ మూలాలున్న వ్యక్తులు ప్రపంచంలోని ప్రముఖ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో అనిల్ నియామకం మరో కీలక పరిణామంగా నిలిచింది. AI ఆధారిత టెక్నాలజీతో సాఫ్ట్‌వేర్ రంగం వేగంగా మారుతున్న సమయంలో అనిల్ చక్రవర్తి నాయకత్వంలో అడోబ్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


