Ajith Kumar: తమిళనాడులో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రముఖ నటుడు అజిత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. చెన్నైలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఒలింపిక్ సిటీ’తో పాటు మోటార్‌స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయడాన్ని ఆయన స్వాగతించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్‌కు(CM Vijay) ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి మౌలిక వసతులు ఎంతో ఉపయోగపడతాయని అజిత్ అభిప్రాయపడ్డారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, సదుపాయాలు అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ స్థాయిలో తమిళనాడు నుంచి మరింత మంది ప్రతిభావంతులు ఎదిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
మోటార్‌స్పోర్ట్స్‌లో తనకు ఉన్న ఆసక్తిని ప్రస్తావించిన అజిత్.. ఈ సందర్భంగా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాటలను గుర్తుచేసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత మోటార్‌స్పోర్ట్స్ రంగానికి కీలక ముందడుగుగా అభివర్ణించారు.“తమిళనాడు ప్రభుత్వం వేసిన ఈ చిన్న అడుగు.. భారత మోటార్‌స్పోర్ట్స్‌కు ఒక పెద్ద ముందడుగు” అనే భావనతో ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి విజయ్ చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా క్రీడా రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలు సాకారం కావాలని కోరుకున్నారు.
చెన్నైలో ఏర్పాటు చేయనున్న ‘ఒలింపిక్ సిటీ’ వివరాలను ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో వెల్లడించారు. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ఈ క్రీడా నగరంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలతో పాటు అత్యాధునిక శిక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. హై-పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్లు, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ వంటి విభాగాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో క్రీడాకారులకు శిక్షణ నుంచి ఫిట్‌నెస్, వైద్య సహాయం వరకు ఒకే చోట సమగ్ర సదుపాయాలు లభించనున్నాయి.
అజిత్ కుమార్‌కు నటనతో పాటు మోటార్‌స్పోర్ట్స్‌పై కూడా ప్రత్యేక ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. షూటింగ్‌కు విరామం లభించిన సమయంలో బైక్‌లు, కార్లతో రైడింగ్ చేయడం ఆయనకు ఇష్టమైన వ్యాపకాల్లో ఒకటి. ఇప్పటికే పలు రేసింగ్ ఈవెంట్లలోనూ ఆయన పాల్గొన్నారు. మోటార్‌సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అజిత్ ఓ స్టార్టప్‌ను కూడా ప్రారంభించారు. మోటార్‌స్పోర్ట్స్‌పై ఆయనకున్న ఆసక్తి నేపథ్యంలో తమిళనాడులో ప్రత్యేక మోటార్‌స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఆయన స్పందనకు ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రంలో ఆధునిక క్రీడా మౌలిక వసతులు అందుబాటులోకి వస్తే.. కేవలం క్రికెట్, ఫుట్‌బాల్ వంటి క్రీడలకే కాకుండా మోటార్‌స్పోర్ట్స్ సహా విభిన్న క్రీడా విభాగాల్లోనూ యువతకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది.


