Miss World 2026: వియత్నాంలోని న్హా ట్రాంగ్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2026 గ్రాండ్ ఫైనల్లో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన జోహెరీ మోలా (Joheirry Mola) విజేతగా నిలిచారు. శనివారం జరిగిన తుది పోటీలో ఆరుగురు ఫైనలిస్టులు పోటీపడగా.. అందరినీ వెనక్కి నెట్టి జోహెరీ మోలా ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
మలేషియా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, వియత్నాం, ఎరిట్రియా దేశాలకు చెందిన అందాల భామలతో కలిసి జోహెరీ మోలా ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నారు. చివరకు విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన మాజీ మిస్ వరల్డ్ ఓపల్ సుచాటా చువాంగ్శ్రీ ఫైనల్ వేడుకకు హాజరై.. జోహెరీ మోలాకు కిరీటం అలంకరించి అధికారికంగా టైటిల్‌ను అప్పగించారు.
స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్ అలబెర్న్ మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. భారత్ తరఫున నికితా పోర్వాల్ ఈ పోటీలో పాల్గొన్నారు. టాప్ 40 వరకు చేరుకున్న ఆమె ఆ తర్వాత పోటీ నుంచి నిష్క్రమించడంతో మిస్ వరల్డ్ 2026లో భారత ప్రయాణం ముగిసింది. అయితే గ్రాండ్ ఫినాలేలో నికితా తన ప్రత్యేకమైన కార్సెట్ దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించారు.


