Ravi Teja: మాస్ మహారాజా రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ’(Maremma). మంచాల నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రవితేజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే సినిమా చూసిన ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
‘మారెమ్మ’ చాలా సహజంగా తెరకెక్కిన రస్టిక్, రూటెడ్ మూవీ అని రవితేజ ప్రశంసించారు. గ్రామీణ నేపథ్యంలో విభిన్నమైన కథను ఎంచుకోవడం సినిమాకు ప్రధాన బలమన్నారు. ముఖ్యంగా హీరో మాధవ్, గేదె మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు. సినిమా కోసం మాధవ్ చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, అతడి లుక్, గడ్డం, ఎత్తు పాత్రకు బాగా సరిపోయాయని రవితేజ అభినందించారు. హీరోయిన్ దీపా బాలు తెలంగాణ యాసను నేర్చుకుని చక్కగా నటించారని, వికాస్ నటన కూడా ఆకట్టుకుందని చెప్పారు.
సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలోని ఓ గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కిందని రవితేజ వెల్లడించారు. మహీషాపురం గ్రామం, గ్రామదేవత మారెమ్మ చుట్టూ కథ సాగుతుందని తెలిపారు.
తన తొలి సినిమాకు రవితేజ ముఖ్య అతిథిగా రావడం ఎంతో ప్రత్యేకమని మాధవ్ భూపతిరాజు భావోద్వేగానికి గురయ్యారు. పెదనాన్నగా మాత్రమే కాకుండా అన్నయ్యలా తనను ప్రోత్సహిస్తారని చెప్పారు.


