మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’తో పాటు మెగా 158వ చిత్రంలో నటిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే మెగా 158 నుంచి చిత్రబృందం అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేసింది. కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గతంలో ఈ సినిమాకు ‘కదిరి’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. చిత్రబృందం అనూహ్యంగా ‘కాకా’ పేరును ప్రకటించింది. టైటిల్ రివీల్‌తో మెగా అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
విడుదలైన గ్లింప్స్‌ను పరిశీలిస్తే.. రొయ్యల ఫామ్ నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవి ‘సత్యం’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఫామ్‌లో హెడ్‌గా పనిచేస్తూ అక్కడి వారితో సరదాగా ఉంటూ పనులు చేయించే వ్యక్తిగా ఆయన పాత్రను చూపించారు. ‘కాకా’లో చిరంజీవి గత చిత్రాలకు పూర్తి భిన్నమైన లుక్‌లో కనిపిస్తున్నారు. కళ్లజోడుతో స్టైలిష్‌గా కనిపించిన మెగాస్టార్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. గ్లింప్స్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా అభిమానులు చిరు లుక్, టైటిల్‌పై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో వీరిద్దరి కలయికలో వస్తున్న ‘కాకా’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి చిరంజీవిని బాబీ మరింత కొత్తగా చూపించబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం కథకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం వెల్లడించలేదు. రొయ్యల ఫామ్ నేపథ్యంలో సాగే ఈ కథలో చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతోంది? ఆయన పాత్రకు ‘కాకా’ టైటిల్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.


