ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమంగా దాచిన భారీ మొత్తంలో బంగారాన్ని BSF సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని బన్పూర్ ప్రాంతంలో ఓ మహిళ కొంతకాలంగా అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని జవాన్లు గుర్తించారు. దీంతో ఆమె కదలికలపై నిఘా పెట్టారు.ఆదివారం ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు.. అనంతరం ఆమె నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏకంగా 15.6 కిలోల బంగారం బయటపడింది. దాని విలువ రూ.24 కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.


