Indian Army: లక్షల రూపాయల జీతం, అంతర్జాతీయ స్థాయి సంస్థలో మంచి కెరీర్.. ఇవన్నీ ఉన్నప్పటికీ దేశ సేవకే ప్రాధాన్యం ఇచ్చాడు ఓ యువ టెకీ(Amazon Techie). లక్నోకు చెందిన 27 ఏళ్ల శార్దేందు తివారీ అమెజాన్‌లో క్లౌడ్ ఇంజినీర్‌గా ఏడాదికి సుమారు రూ.46 లక్షల ప్యాకేజీతో పనిచేశారు. అయితే చిన్ననాటి నుంచి ఉన్న సైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకునేందుకు ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు.
ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శార్దేందు తండ్రి హానరరీ కెప్టెన్ రాజ్ కుమార్ తివారీ 36 ఏళ్ల పాటు ఆర్మీ సర్వీస్ కార్ప్స్లో సేవలందించారు. తండ్రి స్ఫూర్తితోనే శార్దేందుకు సాయుధ దళాలపై ఆసక్తి పెరిగింది. చండీమందిర్ కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్న ఆయన బీఈతో పాటు పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం అమెజాన్‌లో పనిచేశారు. ఎయిర్బస్లోనూ పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ సైన్యంలో చేరాలన్న లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు.
ఆర్మీలో చేరేందుకు ఏకంగా ఎనిమిదిసార్లు ప్రయత్నించిన శార్దేందు చివరకు టెక్నికల్ ఎంట్రీ ద్వారా ఎంపికయ్యారు. గయాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ సమయంలో తన నాయకత్వ ప్రతిభతో సీనియర్ అండర్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ అంటే ఇష్టపడే శార్దేందు ప్రయాణం నేటి యువతకు నిజంగా స్ఫూర్తిదాయకం.


