WORLD MAP: ఇన్నాళ్లుగా మనం చూస్తున్న ప్రపంచ పటంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. దేశాలు, ఖండాల వాస్తవ పరిమాణాలను మరింత స్పష్టంగా చూపించే కొత్త మ్యాప్‌పై ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెర్కేటర్ ప్రొజెక్షన్‌కు బదులుగా ‘ఈక్వల్ ఎర్త్’ వంటి ప్రొజెక్షన్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
టోగో నేతృత్వంలో, ఆఫ్రికన్ యూనియన్ మద్దతుతో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు 164 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, అమెరికా వ్యతిరేకంగా ఓటు వేసినట్లు పేర్కొంటున్నారు. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయంపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచంలోని కీలక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ఐరాస.. మ్యాప్‌ల అంశంపై సమయం కేటాయించడం సరికాదని అమెరికా ప్రతినిధి వ్యాఖ్యానించారు.
1569లో ఫ్లెమిష్ కార్టోగ్రాఫర్ గెరార్డస్ మెర్కేటర్ రూపొందించిన ఈ ప్రొజెక్షన్ ప్రధానంగా సముద్ర నావిగేషన్ కోసం ఉపయోగపడింది. దిశలు, కోణాలను కచ్చితంగా చూపించడం దీని ప్రత్యేకత. అయితే భూమి గోళాకారంగా ఉండటంతో దానిని సమతల పటంగా చూపించే క్రమంలో భూభాగాల పరిమాణాల్లో వక్రీకరణ ఏర్పడుతుంది. దీనికి గ్రీన్‌ల్యాండ్, ఆఫ్రికా మంచి ఉదాహరణ. మెర్కేటర్ మ్యాప్‌లో గ్రీన్‌ల్యాండ్ భారీగా కనిపించినప్పటికీ.. వాస్తవానికి ఆఫ్రికా దాని కంటే సుమారు 14 రెట్లు పెద్దది. అలాగే ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న దేశాలు, ప్రాంతాలు వాస్తవ పరిమాణం కంటే పెద్దగా కనిపిస్తాయి.
2018లో అభివృద్ధి చేసిన ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ భూభాగాల వైశాల్య నిష్పత్తులను మరింత వాస్తవికంగా చూపించేలా రూపొందించారు. ఇందులో ఆఫ్రికా తన వాస్తవ పరిమాణానికి దగ్గరగా కనిపిస్తుంది. యూరప్, ఉత్తర అమెరికా వంటి ప్రాంతాలు మెర్కేటర్ మ్యాప్‌తో పోలిస్తే చిన్నగా కనిపిస్తాయి. అయితే మెర్కేటర్ మ్యాప్‌ను పూర్తిగా తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. నావిగేషన్ వంటి రంగాల్లో దాని ప్రత్యేక ఉపయోగం ఇప్పటికీ ఉంది. కొత్త మ్యాప్ ఉద్దేశం ప్రపంచాన్ని మార్చడం కాదు.. ప్రపంచాన్ని మనం చూసే విధానాన్ని మరింత వాస్తవికంగా మార్చడం.


